Chandrababu: చంద్రబాబుకు నోటీసులు... నటుడు శివాజీ చెప్పింది వీటి గురించేనా?
- చంద్రబాబుపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందన్న శివాజీ
- ఆపరేషన్ గరుడలో కేంద్రం జోరు పెంచిందన్న నటుడు
- నోటీసులు జారీ కావడంతో సర్వత్ర చర్చ
ఆంధ్రప్రదేశ్‌పై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నోటీసులు అందబోతున్నాయంటూ ఇటీవల సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఆయన చెప్పినట్టే చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు మళ్లీ శివాజీపైకి మళ్లింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల నాటి బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం పెను దుమారమే రేపుతోంది. చంద్రబాబుపై పెట్టిన కేసును మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉపసంహరించుకుందన్న వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ ఈ కేసు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నోటీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోర్టుకు హాజరైతే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు.
చంద్రబాబుపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, ఆయనను సీఎం పదవి నుంచి దించేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల శివాజీ మీడియా సమావేశంలో ఆరోపించారు. చంద్రబాబును తొలి నుంచీ ఇబ్బంది పెడుతున్న కేంద్రం అందు కోసం ‘ఆపరేషన్ గరుడ’ను అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగైదు రోజుల్లో చంద్రబాబుకు నోటీసులు అందబోతున్నాయంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు రావడంతో శివాజీ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.