knt sastry: ఏడు జాతీయ అవార్డుల గ్రహీత దర్శకుడు కేఎన్టీ శాస్త్రి కన్నుమూత!
- దర్శకుడు, సినీ విమర్శకుడిగా సుపరిచితం
- అంతర్జాతీయ జ్యూరీ సభ్యుడిగానూ పనిచేసిన శాస్త్రి
- చిన్నారుల కోసం తీసిన ‘షాను’నే ఆఖరి సినిమా
ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత, సినీ విమర్శకుడు కేఎన్టీ శాస్త్రి (70) కన్నుమూశారు. దర్శకుడిగా, రచయిత, విమర్శకుడిగా ఆయన 7 జాతీయ అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా సురభి(1999), తిలదానం(2002) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులను పొందారు. అలాగే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా శాస్త్రి పనిచేశారు.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో 1945, సెప్టెంబర్ 5న శాస్త్రి జన్మించారు. అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై ఆయన 12 అవార్డులను అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'తిలదానం' సినిమాను ద.కొరియాలోని బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ చిత్రం ఏకంగా 7 అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టడంతో పాటు 45 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది.
తెలంగాణలో అమ్మాయిల అక్రమ రవాణా కథాంశంగా శాస్త్రి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘హార్వెస్టింగ్ బేబీ గర్ల్’ ఆమెస్టర్ డ్యామ్ లో జరిగిన డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ లో ఆడియెన్స్ అవార్డును గెలుచుకుంది. శాస్త్రి తిలదానం, సురభి, కమ్లీ, సరసమ్మన, సలాదు, షాను చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో రాసిన ‘అలనాటి చలన చిత్రం’ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది.