surgical strike: సర్జికల్ స్ట్రయిక్స్‌లో భారత సైన్యం అద్భుత వ్యూహం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన బ్రిగేడ్ కమాండర్ నింబోర్కర్!
- రెండేళ్ల క్రితం పాక్ భూభాగంలో సర్జికల్ దాడులు
- వెంట చిరుత పులి మల మూత్రాలను తీసుకెళ్లిన సైన్యం
- శునకాలను తప్పుదారి పట్టించేందుకేనన్న నింబోర్కర్
పాకిస్థాన్ ముష్కర మూకల పనిపట్టేందుకు రెండేళ్ల క్రితం భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. సరిహద్దులు దాటి వెళ్లి ఉగ్రవాదుల భరతం పట్టింది. సంచలనం సృష్టించిన ఈ దాడుల వెనక ఉన్న మరో ఆసక్తి గొలిపే విషయాన్ని మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నింబోర్కర్ వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా చిరుతపులి సాయం కూడా తీసుకున్నారన్నదే ఆ విషయం. అయితే, నేరుగా పులిని వెంటబెట్టుకు వెళ్లలేదు. దాని మలమూత్రాలను వినియోగించుకున్నారు.
ఆపరేషన్ చేపట్టిన నౌషెరా సెక్టారులో పగటి పూట శునకాలపై చిరుత పులులు దాడి చేయడం పరిపాటి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు శునకాలు పగలంతా దాక్కుని రాత్రుళ్లు బయటకు వస్తాయి. భారత సైన్యం సర్జికల్ దాడులు చేపట్టినప్పుడు శునకాలు ఉండే గ్రామాలను దాటుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తే కుక్కలు పసిగట్టి అరిచే ప్రమాదం ఉంది.
అదే జరిగితే ఆపరేషన్ విఫలమై, పాక్ సైనికులు మేల్కొని కాల్పులకు దిగుతారు. కాబట్టి శునకాలు బయటకు రాకుండా ఉండేందుకు సైన్యం ఓ ఉపాయం ఆలోచించింది. వెంట చిరుత మలమూత్రాలను తీసుకెళ్లి శునకాలు ఉండే గ్రామాల్లో చల్లింది.. ఆ వాసనకు చిరుతలు సంచరిస్తున్నాయని భావించిన శునకాలు బయటకు రాలేదు. ఫలితంగా ఆపరేషన్ విజయవంతమైందని నింబోర్కర్ తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో బ్రిగేడ్ కమాండర్‌గా పనిచేసిన నింబోర్కర్ సర్జికల్ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గౌరవిస్తూ పూణేకు చెందిన థార్లో బాజీరావ్ పేష్వీ ప్రతిష్ఠాన్ మంగళవారం సన్మానించింది. ఈ సందర్భంగా నింబోర్కర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.