Bangladesh: పిల్లాడి ఆకలి తీర్చలేక గొంతులో ఉప్పు పోసి ఉసురు తీసిన తల్లి!

  • కుటుంబాన్ని పట్టించుకోని భర్త
  • మనస్తాపానికి లోనై చిన్నారిని చంపిన మహిళ
  • అరెస్ట్ చేసిన పోలీసులు

బిడ్డ ఏడిస్తే కన్నతల్లి మనసు అల్లాడిపోతుంది. బిడ్డ తిరిగి నవ్వేవరకూ ఆమె ప్రాణం కుదుటపడదు. కానీ బంగ్లాదేశ్ లో ఇందుకు పూర్తి విరుద్ధమైన ఘటన చోటుచేసుకుంది. ఆకలితో కన్నబిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయిన తల్లి.. పిల్లాడి గొంతులో ఉప్పు పోసి హత్య చేసింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ బిచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప(2) తో పాటు రెండు నెలల బాబు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే బిచ్చు ఇటీవల పని మానేసి ఇంట్లో కూర్చోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు సాతీ డబ్బు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టేసి చల్లగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని చెబుతూ పిడికిలి నిండా ఉప్పును తీసుకుని చిన్నారి గొంతులో పోసేసింది.

అనంతరం కొద్దిసేపటికే తాను చేసిన తప్పును తెలుసుకున్న సాతీ, పిల్లాడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చారు. కాగా, ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో సాతీని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News