paruchuri: ఇక మీ సినిమాలో వేషం వేయనని ఆ దర్శకుడికి చెప్పేశాను!: పరుచూరి గోపాలకృష్ణ
- అశ్వనీదత్ కోరితే ఆ పాత్ర చేశాను
- అప్పుడు నేను 'జైలుపక్షి'తో బిజీ
- విగ్గు పెట్టుకుని సెట్లోనే మాటలు రాసేవాణ్ణి
తెలుగు చిత్రపరిశ్రమలో రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పరుచూరి గోపాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ 'బ్రహ్మ రుద్రులు' సినిమాను గురించి ప్రస్తావించారు. 'ప్రతిధ్వని' సినిమాలో బలగంపూడి సీతయ్య పాత్రకి గాను నాకు మంచి పేరు వచ్చింది. దాంతో ఇంచుమించు అదే గెటప్ లో నాతో 'బ్రహ్మరుద్రులు'లో ఒక పాత్రను చేయించారు. ఆ పాత్రను కూడా నిర్మాత అశ్వనీదత్ బలవంతంపై చేశాను.
అప్పుడు నేను 'జైలుపక్షి' సినిమాకి మాటలు రాయడంలో బిజీగా వున్నాను. 'బ్రహ్మరుద్రులు' సెట్లో డైలాగ్స్ రాయడం ఇబ్బంది అవుతుండటంతో, 'విగ్గు పెట్టుకుని డైలాగ్స్ రాయడం కష్టమవుతోంది .. 'నన్ను కాస్త ముందుగా పంపించు' అని దర్శకుడు మురళీమోహన్ రావు తో అన్నాను. 'నాగేశ్వరరావు కంటే ముందుగా పంపించాలా?' అని ఆయన అన్నాడు. 'అలా అని కాదు నా షాట్ కాగానే పంపించేయ్' అన్నాను. 'అలాగే' అనేసిన ఆయన సాయంత్రం వరకూ నన్ను పిలవలేదు .. పేకప్ చెప్పడానికి ముందు ఆ షాట్ తీశాడు. అప్పుడు మాత్రం 'మురళీ .. నీకు మళ్లీ సినిమాలు రాస్తానో లేదో నాకు తెలియదుగానీ, నీ సినిమా కోసం మాత్రం ఇక నేను మేకప్ వేయను'.. నిజంగా నాకు చాలా బాధేసింది అనేశాను" అంటూ చెప్పుకొచ్చారు.