Facebook: ఇంటి నుంచి పారిపోయిన పిల్లాడు.. 8 ఏళ్ల తర్వాత ఫేస్ బుక్ సాయంతో పట్టుకున్న పోలీసులు!
- ఇంటి నుంచి పారిపోయిన సుజిత్
- ఫేస్ బుక్ లో వెతికిన కుటుంబ సభ్యులు
- పోలీసుల సాయంతో ఇంటికి చేరుకున్న యువకుడు
టెక్నాలజీతో దుష్పరిణామాలు ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి. దానికి తాజా ఉదాహరణే ఇది. చదువుకోవడం ఇష్టం లేని ఓ పిల్లాడు ఇంటి నుంచి పారిపోగా.. దాదాపు 8 సంవత్సరాలు కష్టపడ్డ అతని కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఫేస్ బుక్ ద్వారా పట్టుకోగలిగారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బిహార్ కు చెందిన అజిత్ కుమార్ తన కుటుంబంతో కలసి హైదరాబాద్ లోని మౌలాలీలో నివాసం ఉంటున్నాడు. అజిత్ కుమార్ బావమరిది సుజిత్(15) కూడా వీరితో కలసి వచ్చేశాడు. అయితే కుటుంబ సభ్యులు చదువుకోవాలని ఒత్తిడి చేయడంతో సుజిత్ 2011లో ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు వెతికివెతికి అలసిపోయారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో బావమరిది పేరుతో ఉన్న ప్రొఫైల్స్ ను అజిత్ చెక్ చేసేవాడు.
ఓ రోజు సుజిత్ పోలికలతో ఉన్న ఓ అకౌంట్ ను చూసి అతను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో ఈ రిక్వెస్ట్ ను తిరస్కరించిన ఆ వ్యక్తి అజిత్ ను బ్లాక్ చేసేశాడు. దీంతో అతను తన బావమరిది సుజితే అని నిర్ధారణకు వచ్చి, సైబర్ క్రైమ్ పోలీసులను అజిత్ ఆశ్రయించాడు. సుజిత్ ఫేస్ బుక్ ఖాతా ఐపీ అడ్రస్ ద్వారా అతను ముంబైలోని మజ్ గావ్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి నేతృత్వంలో ముంబైకి వెళ్లిన సైబర్ క్రైమ్ అధికారులు ..స్థానిక పోలీసులతో మాట్లాడి సుజిత్ ను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఈ కేసును ఛేదించిన సైబర్ క్రైం బృందాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించి రివార్డును ప్రకటించారు. కాగా, ముంబైకి పారిపోయిన సుజిత్ ఓ క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. సుజిత్ ను పోలీసులు తీసుకువచ్చి అప్పగించడంపై బావ అజిత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. సుజిత్ ను ఇంటికి చేర్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.