rajaiah: రాసలీలల రాజయ్య మాకొద్దు.. మార్చండి!: టీఆర్ఎస్ అసమ్మతి నేతల డిమాండ్
- అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు
- ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారు
- రాజయ్యకు టికెట్ ఇస్తే.. టీఆర్ఎస్ ఓడిపోతుంది
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు నిరసన సెగలు తగులుతున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో పాటు, మహిళా సమాజాన్ని కించపరిచేలా రాసలీలలకు పాల్పడుతున్న రాజయ్య తమకు వద్దని... టీఆర్ఎస్ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత సూదుల రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలు ఈ మేరకు డిమాండ్ చేశారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజయ్యను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని అసమ్మతి నేతలు తెలిపారు. ఓ మహిళతో రాజయ్య అసభ్య ఫోన్ సంభాషణలు చేసిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని... అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే, ప్రజల్లో పార్టీ చులకన అవుతుందని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఈ విషయంపై స్పందించి, రాజయ్య స్థానంలో మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజయ్యకే టికెట్ ఇస్తే ఈ నియోకవర్గంలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు.
మరోవైపు ఈ అంశంపై రాజయ్య మాట్లాడుతూ, తాను ఏ మహిళతోనూ అసభ్యంగా మాట్లాడలేదని చెప్పారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. తానంటే గిట్టని వారే ఇలాంటి నీచమైన ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.