Andhra Pradesh: విశాఖలో అద్భుతం! పిడుగుపడి ఇల్లు ధ్వంసం.. ఊయల్లోని చిన్నారి మాత్రం సేఫ్!
- పిడుగు పడి కాలిన ఇల్లు
- విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం
- ఊయల కాలినా చిన్నారి సురక్షితం
అద్భుతం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఊహించడం కష్టం. పిడుగు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది పడిన చోట భూమి కుంగడమే కాదు.. పరిసరాలు అగ్నికి ఆహుతవుతాయి. కొన్ని వేల వోల్టుల విద్యుత్ శక్తి దానికి ఉంటుంది. అంత ప్రమాదకరమైన పిడుగు కూడా ఊయల్లో నిద్రిస్తున్న చిన్నారిని తాకలేకపోయింది. విశాఖపట్టణం జిల్లా సబ్బవరంలో జరిగిందీ అద్భుత ఘటన.
స్థానిక సాయినగర్ కాలనీలో నక్క దేవప్రసాద్, సారూమ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు రంజిత్ ఉన్నాడు. మంగళవారం సాయంత్రం రంజిత్ ఏడుస్తుంటే అతడిని నిద్రపుచ్చేందుకు చీరతో కట్టిన ఊయలలో పడుకోబెట్టి తల్లి నిద్రపుచ్చింది. అదే సమయంలో భారీ వర్షం పడడంతో ఓ పిడుగు వారి ఇంటి రేకుపై పడింది.
పిడుగు ధాటికి ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నీ కాలిబూడిదయ్యాయి. ఇంట్లోని నేల కుంగిపోయింది. ఊయల కూడా కాలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఊయలలో నిద్రపోతున్న చిన్నారికి ఏమీ కాలేదు. అంతేకాదు, ఊయల దగ్గరే ఉన్న రంజిత్ తల్లికి కూడా ఏమీ కాలేదు. విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిడుగు కూడా బాలుడిని ఏమీ చేయలేకపోయిందని, అతడు మృత్యుంజయుడని అంటున్నారు.