hdfc: హెచ్డీఎఫ్సీ వైస్ ప్రెసిడెంట్ హత్య కేసు.. నిందితుడిని పట్టిచ్చిన ‘సిమ్’!
- సిద్ధార్థ్ ను హత మార్చింది సహోద్యోగులు కాదు
- డబ్బు అవసరం పడ్డ ఓ వ్యక్తే ఈ హత్య చేశాడు
- ముంబై పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు
ఈ నెల 5న హెచ్డీఎఫ్సీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సంఘ్వీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు కారణం సహోద్యోగులే అనే అనుమానాలకు ఇప్పుడు తెరపడింది. సిద్ధార్థ్ సంఘ్వీని హతమార్చిన నిందితుడు సర్ఫరాజ్ ను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సర్ఫరాజ్ తన అవసరాల కోసం, బైక్ కు ఈఎంఐలు చెల్లించేందుకు డబ్బు అవసరం పడింది. ఈ నేపథ్యంలో కమలా మిల్స్ ఆఫీసు కాంపౌండ్ లోని పార్కింగ్ ప్రాంతంలో సిద్ధార్థ్ సంఘ్వీని దోచుకునే ప్రయత్నం చేశాడు. తనకు రూ.35 వేలు ఇవ్వాలంటూ సిద్ధార్థ్ ను కత్తితో బెదరించాడు.
అందుకు, సిద్ధార్థ్ అంగీకరించకపోగా అరిచేందుకు యత్నించాడు. దీంతో, తన వద్ద ఉన్న కత్తితో సిద్ధార్థ్ గొంతులో పొడిచాడు. ఈ ఘటనలో సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ఆయన కారులోనే వెనుక భాగంలో సీటు కింద ఉంచి, సర్ఫరాజ్ ఆ కారుతోనే కల్యాణ్ హై వే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని పడేసి, కారును మాత్రం నవీ ముంబయి ప్రాంతంలో వదిలేశాడు. మృతుడి సెల్ ఫోన్ ను మాత్రం సర్ఫరాజ్ తనతో తీసుకుపోయాడు. ఆ ఫోన్ లో సిద్ధార్థ్ సిమ్ ను తీసేసి తన సిమ్ వేసుకున్నాడు.
ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత సిద్ధార్థ్ కుటుంసభ్యులకు సర్ఫరాజ్ ఫోన్ చేశాడు. అతను క్షేమంగా తన వద్దే ఉన్నాడని, తనకు డబ్బు పంపాలని, మరిన్ని వివరాలతో మళ్లీ ఫోన్ చేస్తానని వారికి చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిందితుడు చేసిన ఈ పొరపాటే అతన్ని పోలీసులకు పట్టిచ్చింది. సిద్ధార్థ్ కుటుంబసభ్యులకు సర్ఫరాజ్ చేసిన ఫోన్ కాల్ అనంతరం, అతని కదలికలపై ముంబై పోలీసులు నిఘా పెట్టి, అతన్ని పట్టేశారు. అనంతరం విచారణలో అసలు విషయం బయటపడినట్టు పోలీసులు వివరించారు.
కాగా, మృతుడు సిద్ధార్థ్ పర్స్, రిస్ట్ వాచ్ తమకు ఇంకా దొరకలేదని, వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ముంబై పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రోజున సిద్ధార్థ్ సంఘ్వీ తన కార్యాలయం నుంచి రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చారు. కానీ, ఆయన కారు మాత్రం ఆరోజు రాత్రి 11.20 గంటల సమయంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్టు సీసీటీవీలలో రికార్డై ఉండటం గమనార్హం. అయితే, ఈ మూడు గంటల సమయంలో అసలు ఏం జరిగిందో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.