asaram bapu: ప్లీజ్.. ఈ శిక్ష తగ్గించండి!: గవర్నర్‌ను క్షమాభిక్ష కోరిన ఆశారాం బాపూ
- బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపూ
- వృద్ధాప్యం కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానని వినతి
- హోంశాఖను సవివర నివేదిక కోరిన గవర్నర్
ప్రస్తుతం వృద్ధాప్యపు సమస్యలతో సతమతమవుతున్న తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ రాజస్థాన్ గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. 2013 ఆగస్ట్ 15 రాత్రి ఆశారాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని 16 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, దాఖలైన కేసులో ఆశారాంను దోషిగా నిర్ధారిస్తూ జోథ్‌పూర్ కోర్టు ఏప్రిల్ 25న జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం తాను వృద్ధాప్యం కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానని, కాబట్టి తన శిక్ష తీవ్రతను తగ్గించాలంటూ క్షమాభిక్ష లేఖలో ఆశారాం గవర్నర్‌ను కోరారు.
దీంతో దీనిపై సమగ్ర నివేదిక కోరుతూ సదరు లేఖను గవర్నర్ హోంశాఖకు పంపారు. ఈ మేరకు జోథ్‌పూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కైలాష్ త్రివేది మాట్లాడుతూ, జిల్లా అధికారులను, పోలీసులను ఈ విషయంలో నివేదిక కోరినట్టు తెలిపారు. నివేదిక రాగానే దానిని రాజస్థాన్ డీజీకి పంపుతామని పేర్కొన్నారు.