Chandrababu: మా జాతికి బీసీ-ఎఫ్ సర్టిఫికెట్లు ఇప్పించండి: చంద్రబాబుకు ముద్రగడ లేఖ
- అసెంబ్లీలో సవరణలతో కూడిన బిల్లును ప్రవేశపెట్టండి
- గవర్నర్ ఆమోదంతో చట్టం చేయించండి
- కాపు రిజర్వేషన్లకు శుభం కార్డు చూపించండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాన్ని సంధించారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్లను కల్పించాలంటూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన రిజర్వేషన్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సవరణలతో కూడిన బిల్లును ప్రవేశపెట్టి, గవర్నర్ ఆమోదంతో చట్టం చేయించాలని సూచించారు. బిల్లుకు చట్టరూపం వచ్చిన తర్వాత ఓ జీవో ఇచ్చి, తమ జాతికి బీసీ-ఎఫ్ సర్టిఫికెట్లను ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు.
అవసరమైతే కొంత మంది న్యాయవాదుల చేత తానే బిల్లును తయారు చేయిస్తానని ముద్రగడ చెప్పారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, శుభం కార్డు చూపించాలని కోరారు. కాపు రిజర్వేషన్లను తొలుత రాష్ట్రంలో అమలు చేసి, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల గురించి ఆలోచించాలని లేఖలో సూచించారు.