Petrol: పెట్రోలు భారం కాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా చెప్పిన మంత్రి వర్యులు!
- పెట్రోలు ధరలకు, కేరళ వరదలకు లింకు పెట్టిన అమాత్యుడు
- ప్రభుత్వానికి బోల్డంత డబ్బులు కావాలన్న మంత్రి
- ఇతర ఖర్చులు తగ్గించుకోమని సూచన
దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. సెంచరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో ఆ ముచ్చటా తీరిపోతుంది. పెట్రో భారం భరించలేని సామాన్యులు వాహనాలవైపు చూడడానికి కూడా భయపడుతున్నారు. ఇష్టానుసారం పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ బంద్ విజయవంతం అయింది. పెట్రో ధరల ప్రభావం అన్నింటిపైనా పడడంతో కూరగాయల నుంచి మందుల వరకు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి.
వాస్తవం ఇలా ఉంటే.. రాజస్థాన్ మంత్రి రాజ్‌కుమార్ రిన్వా మాత్రం ప్రజలకు అద్భుతమైన చిట్కా చెప్పారు. పెరుగుతున్న పెట్రోలు ధరలు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎంత పెరుగుతున్నా ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇంతకీ ఆయనిచ్చిన సలహా ఏంటో తెలుసా?.. ప్రజలే జాగ్రత్త పడి ఇంటి ఖర్చులు తగ్గించుకోవాలని!
ఇతర ఖర్చులు తగ్గించుకుంటే అసలు పెట్రోలు ధరలు భారమే కాదని పేర్కొన్నారు. పెట్రోలు ధరలు అనేవి క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్న ఆయన.. కేరళ వరద బాధితులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టారు. కాబట్టి, ప్రభుత్వానికి ఇప్పటికే బోల్డంత డబ్బు కావాలని, ప్రజలు అర్థం చేసుకుని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారా మంత్రివర్యులు.