bjp: భారత్ బంద్‌ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు: రఘువీరారెడ్డి
- బీజేపీ పాలనలో పబ్లిక్ దోపిడీ
- మోదీ పాలనలో రూ.11.50 లక్షల కోట్లు దోచుకున్నారు
- విశ్వాసం చూపిన ప్రజల రక్తాన్ని మోదీ తాగుతున్నారు
భారత్ బంద్ ను శాంతియుతంగా విజయవంతం చేసిన రాజకీయ పార్టీలకు, స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న సంఘాలు, ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (ఏపీసీసీ) డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు భారత్ బంద్‌ను రఘువీరారెడ్డి ప్రారంభించారు. తొలుత విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ నుంచి ఎడ్లబండ్లు, రిక్షాలతో ప్రదర్శనగా బయలుదేరారు. ఏలూరు రోడ్డు, గాంధీనగర్, లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్డు మీదుగా నగరంలో పలు ప్రాంతాలు తిరుగుతూ బంద్ నిర్వహించారు.
అనంతరం, లెనిన్ సెంటర్‌లో మీడియాతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ప్రజా బలంతోనే భారత్ బంద్ విజయవంతమైందని అన్నారు. ఈ దశాబ్దకాలంలో భారత్‌బంద్ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం సాధించలేదని, ఈ బంద్ కు ప్రజల ఆమోదం ఉందని, సహకరించిన రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని రఘువీరారెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రూ.11.50 లక్షల కోట్లను ప్రభుత్వం దోచుకుందని, ఇది పబ్లిక్ దోపిడీ అని, ఇది అత్యంత విషాదకరమైన విషయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎనిమిది రాజకీయ పార్టీలు, దేశంలో 22 పార్టీలతో కలిసి, రాహుల్‌గాంధీ నాయకత్వంలో భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందని, ఎన్నికల ముందు బీజేపీ, ముఖ్యంగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గిస్తామని చెప్పి, నేడు విపరీతంగా పెంచారని అన్నారు. అంతర్జాతీయంగా ముడి సరుకు ధర తగ్గినప్పటికీ ధరలు విపరీతంగా పెంచుతున్నారని, తగ్గిన ముడి సమురు లెక్కలను చూస్తే లీటర్ పెట్రోల్ రూ.48కు, లీటర్ డీజిల్ రూ.37కు విక్రయించాలని అన్నారు.
కానీ లీటర్ పెట్రోల్ దాదాపు రూ.90కు, లీటర్ డీజిల్ రూ.80కు విక్రయిస్తున్నారని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పప్పు, ఉప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, యువకులు మోటార్ సైకిల్‌పై వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. బస్సు, రైళ్లలో ఛార్జీలు ఒకటికి రెండు రెట్లు పెరిగాయని, ప్రయాణం చేయడానికి వీలులేని పరిస్థితి అని, సామాన్యుల బతుకు దుర్భరమైపోయిందని, భారత ప్రభుత్వం 12 సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచిందని, దానికి పర్యవసానంగా పెట్రోల్‌కు 211 శాతం, డీజిల్ మీద 443 శాతం పెంచారని విమర్శించారు.
ఇతర దేశాల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని, ఆ పని చేయకపోగా రూ.11.50 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పదో, పరకో కూడపెట్టుకుంటే దానిని కూడా లాగేసుకున్న దుర్మార్గమైన ప్రభుత్వం నేడు నిస్సుగ్గా మాట్లాడుతోందని, మరో 50 సంవత్సరాలు వీళ్లు అధికారంలో ఉంటారంటా.. నేడు దేశమంతా స్వచ్ఛందంగా ఏ బలవంతం లేకుండా కాంగ్రెస్ పార్టీ పిలుపు నిస్తే దానికి 22 పార్టీలు కలిసి వస్తే..నేడు వ్యాపారస్తులు, చిన్న చిన్న పరిశ్రమలు, ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మూసివేశారని, నూటికి నూరు పాళ్లు భారత్‌బంద్ విజయవంతం అయిందని రఘవీరారెడ్డి అన్నారు.
నేడు మోదీ ఎలా ఉన్నారంటే..ఒక క్రికెటర్ సెంచరీ కొట్టడానికి ఏ విధంగా ఆరాటపడతాడో, పెట్రోల్ ను రూ.100కు తీసుకువెళ్లాలని, డాలర్ ధరను రూ.100కు తీసుకువెళ్లాలనే ఆరాటంతో ఊగిపోతుంటే.. ఇటు సామాన్యులు ఉడికిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే లీటర్‌కు రూ.10 నుంచి రూ.15 నేరుగా తగ్గిపోతుందని అన్నారు.
మోదీకి ఓట్లు వేసి, ఆయనపై విశ్వాసాన్ని చూపించిన భారతీయుల గుండెల నుంచి రక్తాన్ని తాగుతున్నారని, మోదీ ఇతర దేశాల మీద కూడా కమిషన్లు కొడుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి దానిలో కమీషన్.. నేడు ప్రభుత్వం కుళ్లిపోయిందని, దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విపరీతంగా ట్యాక్స్ పెంచుతోందని, కర్ణాటక రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ రూ.7 ఎక్కువగా ఉండగా, పెట్రోల్ రూ.4 ఎక్కువగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ హయాంలో పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవని అన్నారు.