Jarkhand: చితిపై యువతి... నిప్పంటించగానే లేచింది, ఆసుపత్రికి తీసుకెళ్లగానే మరణించింది!
- జార్ఖండ్ లో వింత ఘటన
- పాము కాటుతో స్పృహ కోల్పోయిన కుమారి
- మరణించిందని భావించిన తల్లిదండ్రులు
- విషయం తెలుసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం
పాముకాటుతో తన కుమార్తె మరణించిందని భావించిన ఓ తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అయితే, చితికి నిప్పంటించగానే లేచి కూర్చున్న ఆమె, ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లగానే మరణించిన విచిత్ర ఘటన జార్ఖండ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అమర్ చౌదరి అనే వ్యక్తికి క్రాంతి కుమారి (16) అనే కుమార్తె ఉంది. రాత్రి నిద్రిస్తుండగా ఆమెను పాము కాటేయగా, స్పృహ కోల్పోయింది.
పొద్దున్నే ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించిన ఇంటి సభ్యులు, క్రాంతి కుమారిలో చలనం లేకపోవడాన్ని గమనించి, ఆమె మరణించిందని భావించారు. శ్మశానానికి తీసుకెళ్లి, చితికి నిప్పంటించగా, ఆమె శరీరంలో కదలికలు కనిపించాయి. దీంతో వెంటనే మంటలు ఆర్పివేసిన వారు, అంబులెన్స్ లో ఇంటర్ గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము విషం ప్రభావం శరీరమంతా వ్యాపించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మగథ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతుండగానే ఆమె మరణించింది. దీంతో అప్పటికే ఆమె కోసం సిద్ధం చేసిన చితిపైనే దహన సంస్కారాన్ని నిర్వహించారు.