Telangana: తెలంగాణలో ముందస్తుకు ఉరుకులు... తాజా అప్ డేట్స్!
- నేడు ఢిల్లీకి రజత్ కుమార్
- రేపు హైదరాబాద్ కు రానున్న ఈసీ బృందం
- నివేదిక ఆధారంగా ఎన్నికల తేదీలు
తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత, షెడ్యూల్ కన్నా ముందుగానే ఎన్నికలు జరిపించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ నేడు ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రంలో ఎన్నికలు జరిపించడానికి ఉన్న అవకాశాలను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు వివరించనున్నారు. ఆపై రేపు జాతీయ ఎన్నికల కమిషన్ బృందం రాష్ట్రానికి రానుంది.
12వ తేదీ బుధవారం నాడు సీఎస్, డీజీపీతో ఎన్నికల సంఘం బృంద సభ్యులు సమావేశం కానున్నారు. ఆపై అన్ని జిల్లాల కలెక్టర్ల, ఎస్పీలతోనూ వీరు భేటీ అవుతారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలనూ ఈ బృందం కలిసి, ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను అడిగి తెలుసుకోనుంది. కాగా, ఇప్పటికే గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీల నేతలూ వచ్చి తమను కలవాలని ఈసీ నుంచి లేఖలు వచ్చాయి. రేపు రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఈ బృందం చర్చిస్తుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించే ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే ఎన్నికల తేదీలు ఖరారు కానున్నాయి.
ఇదిలావుండగా, ఇప్పటికే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి దూకుడు మీదున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడో, రేపో మరో జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. రెండో జాబితాలో మరో 10 మంది పేర్ల వరకూ వెల్లడి కానున్నట్టు సమాచారం. ఇక తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తుపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పొత్తు కుదిరి, సీట్ల సర్దుబాటు తరువాతనే ఈ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.