Statue of Unity: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' సిద్ధం... అక్టోబర్ 31న ఆవిష్కరణ!
- నర్మదా నది తీరంలో వల్లభాయ్ పటేల్ విగ్రహం
- 182 మీటర్ల ఎత్తున్న స్టాట్యూ
- ఆవిష్కరించనున్న నరేంద్ర మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' దాదాపుగా సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఈ విగ్రహాన్ని గుజరాత్ లోని నర్మదా నది తీరంలో మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తయారు చేయించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆవిష్కరిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. స్వతంత్ర భారతావనికి తొలి హోమ్ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎన్నో చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేయించేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 182 మీటర్ల ఎత్తులో ఈ భారీ విగ్రహం నిర్మితమైంది. 2013లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహ నిర్మాణాన్ని తలపెట్టినట్టు ఆయనే స్వయంగా పేర్కొన్నారు. భరత జాతి ఐక్యతకు ఈ విగ్రహం నిదర్శనమని వ్యాఖ్యానించిన రూపానీ, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఓ టూరిస్ట్ స్పాట్ అవుతుందని అన్నారు.