Krishnapatnam port: కృష్ణపట్నం రేవు నుంచి ఇక లిక్విడ్ ఎగుమతులు: సీఈవో అనిల్ యెండ్లూరి
- శరవేగంగా విస్తరణ జరుపుకుంటున్న పోర్టు
- ఏడాదిన్నరలో అందుబాటులోకి లిక్విడ్ టెర్మినల్
- రూ.500 కోట్ల పెట్టుబడి
విస్తరణలో భాగంగా ద్రవరూప (లిక్విడ్) పదార్థాల ఎగుమతి, దిగుమతులకు కృష్ణపట్నం పోర్టు రెడీ అవుతోంది. దీని కోసం ప్రత్యేకంగా లిక్విడ్ కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి రూ.500 కోట్లు వెచ్చించనున్నట్టు పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించారు. లిక్విడ్ కార్గో టెర్మినల్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్న కంపెనీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు అనిల్ తెలిపారు.
గతేడాది కృష్ణపట్నం పోర్టు 4.8 లక్షల టీయూఈల కంటెయినర్లను నిర్వహించిందని, ఈసారి అది 6 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసినట్టు అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కొత్తగా మరో 8 లక్షల టీయూఈ కంటెయినర్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తుండడంతో మొత్తం కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యం 20 లక్షలకు పెరగనుంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో పోర్టు 4.5 కోట్ల టన్నుల ఎగుమతి, దిగుమతులు నిర్వహించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దానిని ఆరు కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిల్ వివరించారు. కాగా, ఎల్ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్న పోర్టు అవసరమైతే కొంతమొత్తం పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమైంది. టెర్మినల్ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు గ్యాస్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. పోర్టుకు సమీపంలో కియా, ఇసుజు కంపెనీలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండడంతో కార్ల ఎగుమతి, దిగుమతుల కోసం ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందని అనిల్ పేర్కొన్నారు.