Congress: తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే... విజయావకాశాలు ఎంత?
- 2014లో టీఆర్ఎస్ కు 34.04 శాతం ఓట్లు
- టీడీపీ, కాంగ్రెస్ కు కలిపితే 40 శాతం ఓట్లు
- పాత గణాంకాలు గుర్తు చేసుకుంటున్న ఇరు పార్టీలూ
- టీజేఎస్ నూ కలుపుకుని వెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్న వేళ, తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించాలంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలవాల్సిందేనని రెండు పార్టీల నేతలూ బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో పాటు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం మెండుగా ఉన్న టీడీపీ కలిస్తే, టీఆర్ఎస్ ను అడ్డుకోవచ్చంటూ, 2014 అసెంబ్లీ ఎన్నికల లెక్కలను గుర్తు చేసుకుంటున్నారు.
ఆ లెక్కలను ఓ మారు పరిశీలిస్తే, 2014లో ఒంటరిగా పోటీ చేసిన టీఆర్ఎస్ కు పోలయిన ఓట్లలో 34.04 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా పోటీచేసి 25.91 శాతం ఓట్లు (కాంగ్రెస్ కు 25.02 శాతం, సీపీఐకి 0.89 శాతం) తెచ్చుకోగా, తెలుగుదేశం కూటమికి 21.58 శాతం ఓట్లు (టీడీపీకి 14.55 శాతం, బీజేపీకి 7.03 శాతం) ఓట్లు వచ్చాయి.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సెంటిమెంట్ బలంగా ఉన్న వేళ, టీఆర్ఎస్ కు 34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేసుకుంటున్న విపక్షాలు, ఇప్పుడు ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందని, అది తమకు కలిసొస్తుందని నమ్ముతున్నాయి. ఇక బీజేపీని పక్కనబెట్టి, కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే, 2014లో వచ్చిన ఓట్లే వచ్చినా, టీఆర్ఎస్ కన్నా ఎక్కువగా, అంటే దాదాపు 40 శాతం ఓట్లను తెచ్చుకోవచ్చని ఆ రెండు పార్టీల నేతలూ లెక్కలు కడుతున్నారు.
రాష్ట్రంలో అధికారాన్ని పొందాలంటే, 40 శాతం ఓట్లు చాలన్న అంచనాతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉన్నారు. ఇక సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను కూటమిలో కలపడం ద్వారా ఓటు బ్యాంకును పొందాలని, పరస్పర ఓట్ల బదిలీ కీలకమని నమ్ముతున్న కాంగ్రెస్, కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎస్ నూ కలుపుకు పోవాలని చూస్తోంది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో గత 35 ఏళ్లలో ఎన్నడూ 60 సీట్లు రాలేదు. 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో అధికారం దక్కాలంటే, కనీసం 60 సీట్లలో గెలుపు అవసరం. 1983 ఎన్నికల్లో 43, 1985 ఎన్నికల్లో 14, 1989 ఎన్నికల్లో 58, 1994 ఎన్నికల్లో 10, 1999 ఎన్నికల్లో 43, 2004 ఎన్నికల్లో 54, 2009 ఎన్నికల్లో 50, 2014 ఎన్నికల్లో 21 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపు దక్కాలంటే, పొత్తులు అత్యావశ్యకమని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు.