sivaji: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఇప్పటికే రెండు సార్లు..!: హీరో శివాజీ
- మీడియా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడిని
- ప్రాణాలు పోతాయనే భయం నాకు లేదు.. రాష్ట్రం కోసం పోరాటం ఆగదు
- ప్రత్యేక హోదా కోసం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు
తనకు ప్రాణహాని ఉందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటికే రెండు సార్లు' అంటూ మధ్యలోనే ఆపేశారు. మీడియా లేకపోతే తాను ఎప్పుడో చనిపోయేవాడినని తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాణాలు పోతాయనే భయం తనకు లేదని... రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఆపరేష్ గరుడ రూపు మార్చుకుందని తెలిపారు.
మొన్నటి వరకు పీడీ అకౌంట్ల పేరుతో బీజేపీ గోల గోల చేసి, ప్రజలను మాయలో పడేసి... ఇప్పుడు మరో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును లోపల వేయాలని యత్నిస్తోందని హీరో శివాజీ మండిపడ్డారు. మొన్నటి వరకు తిరుమల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని... ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు, ఎందరో టీటీడీ ఈవోలు పని చేశారని... టీటీడీలో అంతా సవ్యంగానే ఉందని అందరూ చెప్పారని... అయినా, ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చివరకు స్వామీజీలను, ఇతర పార్టీల నేతలను సీన్ లోకి తెచ్చారని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, లేదా తనలాంటి వాళ్లు ఎవరు కూడా మాట్లాడకూడదంటున్నారని... రాష్ట్రంలో బీజేపీని బాగా లేపాలని వచ్చే వారం ఇక్కడకు వస్తారట అంటూ బీజేపీ నేతలపై హీరో శివాజీ మండిపడ్డారు. ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రజలకు వారు చెప్పేందేంటని ప్రశ్నించారు. మీ చేతులారా బీజేపీని ఈ రాష్ట్రంలో చంపేశారని ఆ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు.