Rahul Gandhi: రాహుల్‌గాంధీ మానస సరోవర యాత్రపై బీజేపీ డౌట్
- అసలాయన యాత్రకు వెళ్లారంటారా? అని కేంద్రమంత్రి వ్యాఖ్య
- కమలనాథుల సోషల్ మీడియా ఇన్‌చార్జి ప్రశ్నల వర్షం
- ‘శివుడే విశ్వరూపం’ పేరుతో కాంగ్రెస్ చీఫ్ వీడియో విడుదల
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మానస సరోవర యాత్రపై అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ సందేహాలకు, కాంగ్రెస్ సవాళ్లతో ఈ టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్టు 31న రాహుల్ సెక్యూరిటీ లేకుండానే మానస సరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. హిమాలయాల దారిలో ఓ యాత్రికుడితో ఫొటో దిగారు. ఈ ఫొటోలో రాహుల్ వాడిన చేతికర్ర నీడ మాయమవ్వడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఫొటో షాప్ మాయాజాలంలా ఉందని వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి ప్రీతీ గాంధీ కూడా ‘రాహుల్ నిజంగానే యాత్రకు వెళ్లారా? లేక ఇంటర్నెట్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ చేసి పెడుతున్నారా?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. ద్వేషించే వాళ్లు రాహుల్‌కు దీటుగా నిలబడగలరా? అని ప్రశ్నించింది. కైలాసగిరి ముందు రాహుల్ నవ్వుతూ దిగిన ఫొటోను, 463 నిమిషాల్లో ఆయన 46,433 అడుగులు నడిచారని తెలిపే ‘ఫిట్‌బిట్’ స్క్రీన్‌షాట్‌ను పోస్టు చేసింది. ‘శివుడే విశ్వం’ పేరుతో రాహుల్ కూడా శుక్రవారం హిమాలయాల వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.