Activist: జైలులో నన్ను కొట్టారు.. నేలపై పడుకోబెట్టారు!: స్వలింగ సంపర్కం నేరం కింద 17 ఏళ్ల క్రితం అరెస్టయిన బాధితుడి ఆవేదన
- జైలులో నా హక్కులు మొత్తం లాగేసుకున్నారు
- తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు
- సుప్రీం తీర్పుతో భావోద్వేగానికి గురైన జాఫర్
పరస్పర అంగీకారంతో చేసే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత సెక్షన్ 377కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అత్యున్నత ధర్మాసనం తీర్పును చాలామంది స్వాగతించారు. 17 ఏళ్ల క్రితం ఇదే సెక్షన్ కింద అరెస్టైన అరిఫ్ జాఫర్ (48) జైలులో తనకు ఎదురైన అనుభవాలను తాజాగా వెల్లడించాడు.
2001లో తన కార్యాలయానికి వచ్చిన పోలీసులు తనతో సహా మరో నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిపాడు. 15 రోజులు జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టారని గుర్తు చేసుకున్నాడు. ప్రతీ రోజు తనను చావబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. జైలులో తన హక్కులను పూర్తిగా హరించారని పేర్కొన్నాడు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కటిక నేలపై పడుకోబెట్టారని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతా నిందితుల ఆచూకీ లేకపోవడంతో ఈ కేసు ఇప్పటి వరకు విచారణకు నోచుకోలేదు.
ఎయిడ్స్ రోగులకు సేవలు అందించడంతోపాటు గే హక్కుల కోసం పోరాడుతున్న లండన్‌కు చెందిన సంస్థను జాఫర్ నిర్వహిస్తున్నాడు. సెక్షన్ 377పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించినప్పుడు కోర్టులోనే ఉన్న జాఫర్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని కుప్పకూలాడు. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల కార్యకర్తలు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కాన్ని తాము నేరంగా చూడడం లేదని, అయితే, సేమ్ సెక్స్ రిలేషన్స్‌కు తాము మద్దతివ్వబోమని తేల్చి చెప్పింది. సంస్కృతీ సంప్రదాయాల పరంగా భారతీయ సమాజం ఇటువంటి వాటిని హర్షించదని పేర్కొంది.