Public Transport: దేశంలోని ప్రయాణికుల ఇబ్బందులకు కారణం ఇదేనట!
- అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని బస్సులు
- ప్రతీ వెయ్యిమందికి ఆరు బస్సులే
- వివరాలను వెల్లడించిన ప్రభుత్వం
దేశంలోని ప్రయాణికుల అవస్థలకు కారణం ఏంటో తెలిసింది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. ఇంకా చెప్పాలంటే.. ప్రయాణకుల అవసరం మేరకు కావాల్సిన బస్సుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి కేవలం పదోవంతే. నిజానికి దేశంలో ప్రజా రవాణాకు 30 లక్షల బస్సులు అవసరం కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి ఎన్నో తెలుసా? కేవలం మూడు లక్షలు. అంటే పదో వంతు. ఈ వివరాలను స్వయంగా ప్రభుత్వమే వెల్లడించింది.
దేశంలో మొత్తం 19 లక్షల బస్సులుండగా అందులో 2.8 లక్షల బస్సులను ఆయా రాష్ట్రప్రభుత్వాలు నేరుగా కానీ, అద్దెకు గానీ తీసుకుని నడుపుతున్నాయి. ప్రస్తుత అవసరాలు తీరాలంటే 30 లక్షల బస్సులు కావాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి వైఎస్ మాలిక్ తెలిపారు. రవాణా సేవల్లో నాణ్యత లేకపోవడం, ప్రజా రవాణాకు సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రజలు సొంత వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ చైనాలో ప్రతీ వెయ్యి మందికీ 6 బస్సులు అందుబాటులో ఉండగా, భారత్‌తో కేవలం నాలుగు మాత్రమే అందుబాటులోఉన్నాయన్నారు. దేశంలోని దాదాపు 90 శాతం మందికి సొంత వాహనాలు లేవని తెలిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.