care taker government: భారత రాజ్యాంగంలో 'ఆపద్ధర్మ ముఖ్యమంత్రి' ప్రస్తావనే లేదు!

  • ఆపద్ధర్మ అనేది మన దేశంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది
  • పాలనా సౌలభ్యం కోసం ఆపద్ధర్మను కొనసాగిస్తున్నారు
  • ఆపద్ధర్మ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదు

తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ గవర్నర్ నరసింహన్ కోరడం... దానికి కేసీఆర్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. అసలు 'ఆపద్ధర్మ' అంటే ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్ సభ కానీ, శాసనసభ కానీ కాలపరిమితి కంటే ముందుగానే రద్దయినప్పుడు... కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు అప్పటిదాకా ఉన్న ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ ఆపద్ధర్మంగా కొనసాగుతారు. ఆపద్ధర్మంగా కొనసాగాలని వారిని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు. అప్పటిదాకా ఉన్న మంత్రులు కూడా అవే బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఇలా కొనసాగే ప్రభుత్వాన్నే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. పాలన కొనసాగించే వారిని ఆపద్ధర్మ ప్రధానమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు.

అయితే, అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రధాని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావనే లేదు. ఈ విషయాన్ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగంలో లేనప్పటికీ, మన దేశంలో ఒక సంప్రదాయంగా వస్తోందని అంటున్నారు.

అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా తీసుకోరాదు. కేవలం కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు, రోజువారీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. నామినేటెడ్ పదవుల భర్తీ, ఉన్నతాధికారుల బదిలీలు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, బడ్జెట్ తయారీ, ఆర్డినెన్సుల జారీ లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోరాదు. 

care taker government
care taker chief minister
  • Loading...

More Telugu News