Chandrababu: టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా.. మనపై కేసీఆర్ విమర్శలు అందుకే!: చంద్రబాబు

  • భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలనే యత్నం
  • సమయం, సందర్భం లేకుండా విమర్శలు అందుకే
  • మోదీ-షా వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు

తెలంగాణలో టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా కేసీఆర్ తనను విమర్శిస్తుండడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. గురువారం రాత్రి అమరావతి సచివాలయంలో మంత్రులు, కొందరు పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు, విలేకరుల సమావేశంలో టీడీపీపై కేసీఆర్ చేసిన విమర్శలపై ఇందులో చర్చించారు.  

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ తనను తిడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు.. ఇందులోనూ ఓ వ్యూహం ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీని, తనను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోనూ మోదీ-షాల వ్యూహం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వారి వ్యూహాన్నే కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలన్నదే తన అభిమతమని, అప్పుడూ అదే చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని పేర్కొన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకనే సమయం, సందర్భం లేకుండా మనపై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News