Telangana: నిజాం మ్యూజియం దోపిడీకి పక్కా ప్లాన్.. స్కెచ్‌తో మార్కులు వేసుకుని మరీ చోరీ!

  • చోరీకి ముందు మ్యూజియం లోపల, బయట రెక్కీ
  • దొంగతనానికి ముందు మ్యూజియానికి మార్కులు
  • తాడు సాయంతో కిందికి దిగి విలువైన వస్తువుల చోరీ

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక నిజాం మ్యూజియంలో పక్కా ప్రణాళికతోనే దోపిడీ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పురానాహవేలీలో ఉన్న ఈ మ్యూజియంలోకి ఎలా ప్రవేశించాలో.. ఏం తీసుకెళ్లాలో ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం మ్యూజియం పైన మూడు చోట్ల మార్కులు పెట్టుకున్నారు. ఈ నెల మూడో తేదీన చేసుకున్న మార్కుల ఆధారంగా మ్యూజియంలోకి ప్రవేశించి వచ్చిన పనిని కానిచ్చారు. గ్యాలరీలోకి ప్రవేశించి రెండు గంటల పాటు అక్కడే గడిపిన వీరు కచ్చితంగా స్థానికులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు.  

చోరీ కోసం పథక రచన చేసిన దొంగలు ఇందుకోసం మ్యూజియం లోపల, బయట పలుమార్లు రెక్కీ నిర్వహించారు. మ్యూజియంపైకి ఎలా చేరుకోవాలి? ఎక్కడి నుంచి లోపలికి దిగాలి? సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాము చోరీ చేయాలనుకున్న టిఫిన్ బాక్స్ ఎక్కడ ఉంది? అన్నదానిపై ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఓ రోజు మ్యూజియంపైకి చేరుకుని  ప్రధాన గోడపై పక్క భాగంలో బాణం, నక్షత్రం గుర్తులు పెట్టుకున్నారు.

చేసుకున్న గుర్తుల ఆధారంగా మూడో తేదీ తెల్లవారుజామున చోరీ కోసం మ్యూజియం వద్దకు చేరుకున్నారు. వీరి  కదలికలు ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. 3:20 గంటల ప్రాంతంలో ఇద్దరూ మ్యూజియం పైకి వెళ్లారు. ముందుగానే మార్క్ చేసుకున్న మూడో గ్యాలరీ వెంటిలేటర్ వద్దకు చేరుకుని అద్దాన్ని చప్పుడు రాకుండా తొలగించారు. అనంతరం తాడును లోపలికి వేసిన దుండగుడు దాని సాయంతో కిందికి దిగాడు. తాడు లోపలికి పడడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. లోపలికి దిగుతున్న సమయంలో దుండగుడు కాలితో కెమెరాను కిందికి నెట్టాడు.

అనంతరం బంగారు టిఫిన్ బాక్స్ ఉన్న ర్యాక్ వద్దకు చేరుకుని అద్దాన్ని పగల గొట్టకుండా లోపలికి ఓ చిన్న రాడ్ దూర్చి చాకచక్యంగా సెంట్రల్ లాక్ పైన, కింద ఉన్న మరలను తొలగించాడు. డోరు తెరుచుకున్నాక తనకు కావాల్సిన టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, స్పూన్ తీసుకుని బ్యాగులో పెట్టుకుని వచ్చిన దారిగుండానే పైకి చేరుకున్నాడు. తెల్లవారుజామున 5:20 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు తిరిగి వెళ్లిపోవడం ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.

ఆ సమయంలో ఇద్దరూ మాస్కులు ధరించి ఉన్నారు. వీరిలో ఒకరు కుంటుతూ నడుస్తుండడంతో లోపలికి దిగింది అతడే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యూజియం లోపలికి దిగుతున్న సమయంలో కాలికి దెబ్బ తగిలి ఉంటుందని, అందుకే కుంటుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News