DS: డీఎస్ ఇష్టం.. పార్టీలో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు!: కేసీఆర్
- డీఎస్ కు ఎంతో ఉత్తమమైన గౌరవాన్ని ఇచ్చాం
- డీఎస్ కొడుకును మందలించడం లేదని చెబుతున్నారు
- ఓ నిర్ణయం అయితే తప్పక తీసుకుంటాం
తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) తేల్చి చెప్పడం, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడటం తెలిసిందే. తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్ అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీలో గతంలో డీఎస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారని, తమ పార్టీలో చేరతానని ఆయన అడిగితే చేర్చుకున్నామని చెప్పారు. చాలా తక్కువ కాలంలో పార్టీ ఆయనకు ఎంతో ఉత్తమమైన గౌరవాన్ని ఇచ్చిందని, ఆయన తమ పార్టీలోకి రావడంతోనే అడ్వయిజర్ పోస్ట్ ఇచ్చామని, రాజ్యసభకు వెళతానని కోరితే పంపించామని అన్నారు.
డీఎస్ కొడుకు వేరే పార్టీలోకి పోయాడని, డిస్టర్బ్ చేస్తున్నాడని, కొడుకును మందలించడం లేదని.. డీఎస్ పై తమకు పలు అనుమానాలు ఉన్నాయని నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు తనకు చెప్పారని, పార్టీ నుంచి తొలగించాలని కోరుతూ ఓ తీర్మానం చేసి తనకు పంపారని అన్నారు. దీనిపై కేశవరావు, తాము మాట్లాడుకున్నామని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. పెండింగ్ లో ఉందని, పార్టీలో పరిశీలిస్తామని చెప్పారు.
డీఎస్ టీఆర్ఎస్ లో చేరితే సముచితంగా తాము గౌరవించామని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఉంటే పార్టీలో ఉంటాడు, పోతే పోతాడు, ఆయన ఇష్టం అని, తాము మాత్రం పట్టించుకోమని, అయితే, ఓ నిర్ణయం మాత్రం తాము తప్పక తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.