cpi: సీపీఐ, సీపీఎం మధ్య చిచ్చు రేపిన తెలంగాణ ముందస్తు ఎన్నికలు
- టీఆర్ఎస్ వ్యతిరేక కూటమిలోకి రావాలన్న సీపీఐ
- కాంగ్రెస్ ఉన్న కూటమిలోకి రాలేమన్న సీపీఎం
- తలోదారి చూసుకుంటున్న కమ్యూనిస్టులు
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ఓ వైపు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు ఈ ముందస్తు ఎన్నికలు కమ్యూనిస్టుల మధ్య చిచ్చు రేపాయి. తమకు నచ్చిన పార్టీలతో ముందుకు వెళ్లేందుకు కమ్యూనిస్టులు తలో దారి చూసుకుంటున్నారు. సీపీఎంతో కలసి పని చేసే అవకాశమే లేదని సీపీఐ స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, టీఆర్ఎస్ వ్యతిరేక కూటమితో కలసి రావాలని సీపీఎంకు సీపీఐ సూచించింది. అయితే సీపీఐ ప్రకటనను సీపీఎం నేతలు కొట్టిపారేశారు.
కాంగ్రెస్ పార్టీకి తాము వ్యతిరేకమని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉన్న కూటమిలోకి తాము ఎలా వస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఎల్ఎఫ్ తో ఇప్పటికే కూటమిని ఏర్పాటు చేసిన సీపీఎం... జనసేనతో కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. బీఎల్ఎఫ్ కు సీపీఐ దూరంగా ఉన్న విషయం గమనార్హం. మరోవైపు కోదండరామ్ పార్టీతో కూడా కలసి వెళ్లనున్నట్టు సీపీఎం నేతలు సంకేతాలిచ్చారు. కాబట్టి ఏ రకంగా చూసినా సీపీఐ, సీపీఎంలు కలసి పోటీ చేసే పరిస్థితి లేదనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది.