sivajiraja: శివాజీరాజా, నరేశ్ లు ఆలోచించకుండా బజారున పడ్డారు: తమ్మారెడ్డి భరద్వాజ
- నరేశ్, శివాజీ రాజాలిద్దరూ మంచి పిల్లలు
- ఇద్దరికీ ఏ రకమైన స్వార్థాలు లేవు
- మీ ఇద్దరూ మన కమిటీలో కూర్చుని పరిష్కరించుకోండి
ఇటీవల అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసరడం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని మా కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ డిమాండ్ చేయడం విదితమే.
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘నా ఆలోచన’ ద్వారా తన అభిప్రాయాలను తమ్మారెడ్డి వెలిబుచ్చారు. ‘కోపమొస్తోంది.. నవ్వొస్తోంది. నరేశ్, శివాజీ రాజా లిద్దరూ మంచి పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్లు తెలుసు. నరేష్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరికీ ఏ రకమైన స్వార్థాలు లేవు. కానీ, వీళ్లిద్దరు ఇవాళ రోడ్డున పడటం బాధగా ఉంది.. కోపంగా ఉంది. ఇండస్ట్రీకి ఇద్దరూ కావాల్సిన వాళ్లు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేద్దామనుకున్నారు. దాని కోసం కమిటీలు వేశారు. ఆ ఫంక్షన్ కు ఓ కంపెనీ వాళ్లు కోటి రూపాయలు ఇచ్చారు. ఆ ఫంక్షన్ కు చిరంజీవిగారిని రమ్మని అడిగితే అమెరికా వెళ్లారు. అందరూ కలిసి అమెరికా వెళ్లొచ్చారు. ఇప్పుడు..వాళ్లు ఇచ్చిన కోటి రూపాయలు కంటే ఎక్కువ వస్తుందా? మిగులుతుందా? అనే విషయం సంతకాలు పెట్టకముందు ఆలోచించుకుని ఉండాల్సింది. సంతకాలు పెట్టి వెళ్లి పోయాక ఆ డబ్బులు తినేశారని ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.. శివాజీ రాజా, నరేశ్ లు ఆలోచించకుండా బజారున పడ్డారు.
ఇద్దరూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నవ్వాలో, ఏడ్వాలో, కొట్టాలో, కోప్పడాలో, తిట్టాలో అర్థంకాని పరిస్థితి. మాలాగా ఖాళీగా ఉన్న వాళ్లకో, టీవీలలో మాట్లాడే వారికో అవకాశమివ్వడం తప్ప దీని వల్ల వచ్చేదేమీ లేదు. ఇటువంటి సమస్యలన్నింటికీ సినిమా ఇండస్ట్రీలో మనం ఓ కమిటీ కూడా వేసుకున్నాం. వాస్తవానికి ఆ కమిటీలో కూర్చుని మాట్లాడి ఉండొచ్చు.. సాల్వ్ అయిపోయేది. ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేసుకుని, పబ్లిక్ లోకెళ్లి మనం చులకనవడం.. మనల్ని మనం చులకన చేసుకోవడం చాలా బాధపడాల్సిన విషయం. వాళ్లిద్దరికి (నరేశ్, శివాజీ రాజా)కు నేను విజ్ఞప్తి చేసేదేమిటంటే.. మీ ఇద్దరూ వచ్చి కూర్చుని సమస్యను పరిష్కరించుకోండి. మన కమిటీలో కూర్చుని మాట్లాడుకుంటే పనులు అయిపోతాయని నా ఆలోచన’ అని తమ్మారెడ్డి సూచించారు.