Andhra Pradesh: రూ.6 వేల కోట్ల రెవెన్యూ బకాయిలు రాబట్టండి: ఏపీ మంత్రి యనమల ఆదేశం
- పన్నులు, రావాల్సిన బకాయిల పెండింగ్ లపై దృష్టి
- రెవెన్యూ బకాయిలపై ఆరా తీసిన యనమల
- మూడేళ్లుగా వివిధ శాఖల ద్వారా రావాల్సి ఉన్న రూ.6,428 కోట్లు
పన్నులు, ఇతర మార్గాల్లో రావాల్సిన బకాయిల పెండింగ్ లపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. మూడేళ్ల కాలంగా వివిధ శాఖల ద్వారా రావాల్సి ఉన్న రూ.6,428 కోట్లను తక్షణమే రాబట్టుకోవడంపై ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశం నిర్వహించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక సమావేశంలో శాఖల వారీగా రావాల్సిన రెవెన్యూ బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు.
విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర రెవెన్యూ బకాయిల వివరాలను యనమలకు తెలిపారు. 2015 నుంచి 2018 వరకూ మూడేళ్ల కాలానికి గానూ రెవెన్యూ (నాలా) నుంచి రూ.1,209 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖ రూ.1,264 కోట్లు, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ రూ.776 కోట్లు, గనులు, భూగర్భ శాఖ రూ.487 కోట్లు, కార్మిక శాఖ రూ.441 కోట్లు మేర రెవెన్యూ బకాయిలు రావాల్సి ఉందన్నారు. మిగిలిన శాఖల నుంచి వేల కోట్ల రూపాయల మేర బకాయలు వసూలు కావాల్సి ఉందన్నారు.
దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, రూ.6,400 కోట్లకు పైగా రెవెన్యూ బకాయిలు పేరుకుపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఇదేమీ చిన్న మొత్తం కాదని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ బకాయిలు వసూలైతే ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. అన్ని శాఖలు రెవెన్యూ బకాయిల వసూలపై ప్రత్యేక దృష్టి సారించాలని, శాఖల వారీగా, వ్యక్తులు, సంస్థల వారీగా రెవెన్యూ బకాయిలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
వన్ టైమ్ సెటిల్ మెంట్లతో ఎంతో మేలు
కేసుల పేరుతో కొందరు వ్యక్తులు, సంస్థలు బకాయిలు చెల్లించడం లేదని యనమల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యనమల స్పందిస్తూ, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, ఏయే కేసులున్నాయి... వాటి ప్రగతి వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అలాగే, ఎక్కువ మొత్తంలో బకాయిలున్న వారిని గుర్తించాలని, వారితో నేరుగా మాట్లాడాలని, అసవరమైతే, నిబంధనలకు అనుగుణంగా వన్ టైమ్ సెటిల్ మెంట్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల బకాయిదారులు కూడా తమ బకాయిలు చెల్లించడానికి ముందుకొస్తారని, రెవెన్యూ వసూలులో నిర్లక్ష్యం చూపొద్దని అన్నారు.
నిబంధనలకు అనుగుణంగా పన్నుల వసూళ్లు
గనులు, భూగర్భ శాఖలో రూ.198 కోట్ల మేర రెవెన్యూ బకాయిలున్నాయని, వాటికి అపరాధ రుసుముగా మరో రూ.1200 కోట్లు రావాల్సి ఉందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. పన్నులు వసూలులో చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులకు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పన్నులు వసూలు చేయాలని, ఇష్టారాజ్యంగా పన్నులు, వాటికి అపరాధ రుసుముల వసూలుకు యత్నిస్తే, సంబంధితులు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని అన్నారు.
బకాయిల వసూళ్లపై సమీక్షలు
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని, ఇటువంటి సమయంలో రెవెన్యూ బకాయిలు వసూలైతే, రాష్ట్రంలో అభివృద్ధి పథకాల అమలు జోరందుకుంటుందని యనమల అన్నారు. తక్షణమే రెవెన్యూ బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులకు లేఖలు రాయాలని, తమ శాఖలకు రావాల్సిన బకాయిలపై సమీక్షలు నిర్వహించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను ఆదేశించారు. మరో నెలన్నర తరవాత మరోసారి సమావేశం నిర్వహిద్దామని, ఈలోగా బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ముగ్గురూ రెవెన్యూ వసూళ్లపై పర్యవేక్షిస్తుండాలని, అన్ని శాఖల బకాయిల వివరాలను పొందుపరుస్తూ సాఫ్ట్ వేర్ ను రూపొందిద్దామని రవిచంద్ర తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ వల్ల బకాయిలు ఎంత మేర ఉన్నాయి? ఎన్ని కోట్లు వసూలయ్యాయి? అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని రవిచంద్ర చేసిన సూచనకు యనమల అంగీకరించారు. సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో విధులు నిర్వహించేలేకపోతున్నామని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్టుమెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమేర సిబ్బంది అవసరమో నివేదిక తయారు చేసి, పంపిస్తే ఆమోదిస్తామని యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు.