Nara Lokesh: విభజన తర్వాత 99 శాతం ఐటీ సంస్థలు హైదరాబాద్ కే పరిమితమయ్యాయి: నారా లోకేశ్
- రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని చర్యలు
- సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉంది
- ‘ఫింటెక్ ఫెస్టివల్’ కు విశాఖ సరైన ప్రదేశం
రాష్ట్ర విభజన తర్వాత 99 శాతం ఐటీ సంస్థలు హైదరాబాద్ కే పరిమితమయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రభుత్వం కృషితో విశాఖపట్టణం ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోందని, మార్చి నాటికి ఐటీ సెక్టార్ లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫింటెక్ ఫెస్టివల్ నిర్వహణకు విశాఖపట్టణం అన్ని విధాలా సరైన ప్రదేశమని, రాష్ట్రాభివృద్ధికి ఇదో బృహత్తర వేదిక అని, వినూత్న ఆవిష్కరణలకు ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని అన్నారు.
సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉందని, సాంకేతికత సాయంతోనే అనేక ప్రభుత్వ శాఖల్లో పని సులభతరమైందని, ఫింటెక్ టెక్నాలజీ వినియోగంలో అంతా ప్రథమ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఐటీని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయట్లేదని, మూడు ప్రాంతాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.