DS: నా అంతట నేను వెళ్లను... కావాలంటే మీరే సస్పెండ్ చేసుకోండి!: టీఆర్ఎస్ అధిష్ఠానానికి డీఎస్ స్పష్టీకరణ
- రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్టే
- సస్పెండ్ చేయకుంటే వ్యతిరేక తీర్మానాన్ని వెనక్కి తీసుకోండి
- నిజామాబాద్ లో మీడియాతో డీఎస్
తనంతట తానుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు డి.శ్రీనివాస్ తేల్చిచెప్పారు. తానే రాజీనామా చేసి వెళితే, తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్లవుతుందని అభిప్రాయపడ్డ ఆయన, కావాలంటే పార్టీ అధిష్ఠానమే తనపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తనను సస్పెండ్ చేయాలని, అది చేతకాకుంటే, తనకు వ్యతిరేకంగా చేయించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని డీఎస్ డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు తీర్మానం చేసి, కేసీఆర్ కు పంపారని గుర్తు చేసిన డీఎస్, తన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసునని, తాను ఎవరికీ ద్రోహం చేసింది లేదని చెప్పారు.
స్వతంత్రంగా పెరిగిన తన కుమారులు సొంత నిర్ణయాలు తీసుకుంటారని, వారి నిర్ణయాలను తాను అడ్డుకోలేనని కూడా డీఎస్ వ్యాఖ్యానించారు. ఓ తండ్రిగా ఈ విషయంలో తాను చేసేదేమీ లేదని, ఈ తరహా ఘటనలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయని అన్నారు. 50 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో మెలిగానని, తెలంగాణ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి ధైర్యముంటే తాను ఏం వ్యతిరేక పనులు చేశానో చెప్పాలని సవాల్ విసిరిన ఆయన, మనసులో ఏదో పెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జిల్లా నేతలను విమర్శించారు. రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని డీఎస్ ఆరోపించారు.
కాగా, డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గం ఇటీవల ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్ఠానానికి పంపిన సంగతి తెలిసిందే.