Kerala: కేరళకు కొత్త సమస్య... నీటిలో జంతువుల మూత్రం కలవడంతో 'రాట్ ఫీవర్'!
- దాదాపు 200 మందికి సోకిన వ్యాధి
- ఇంతవరకూ 9 మంది మృతి
- ముందు జాగ్రత్తగా 'డాక్సీ సెలైన్' టాబ్లెట్లు పంచుతున్న అధికారులు
నిన్న మొన్నటి వరకూ భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను నేడు మరో మహమ్మారి 'రాట్ ఫీవర్' రూపంలో పీడిస్తోంది. ఇప్పటికే దాదాపు 200 మందికి ఈ వ్యాధి సోకగా, ఇంతవరకూ 9 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నీటిలో జంతువుల మూత్రం కలిసినందున బ్యాక్టీరియా ప్రబలుతుందని, ఆ నీటిలో పని చేస్తున్న వారికి ఈ వ్యాధి సోకుతుందని అధికారులు అంటున్నారు. వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్న వారికి 'రాట్ ఫీవర్' ను నివారించే 'డాక్సీ సెలైన్' టాబ్లెట్లను ఇస్తున్నామని తెలిపారు.
కాగా, అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులు తదితరాలు ఈ వ్యాధి లక్షణాలని చెప్పారు. ప్రభుత్వం సైతం 'రాట్ ఫీవర్' బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించి, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది.