Forest: నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అరుదైన సర్పజాతి 'వూల్ఫ్ స్నేక్'!
- సాగర్ - శ్రీశైలం అభయారణ్యంలో గుర్తింపు
- లైకోడాన్ ఫ్లావికోల్లిన్ జాతికి చెందినదని వెల్లడి
- 'వూల్ఫ్ స్నేక్' అని కూడా పిలుస్తారన్న అధికారులు
నల్లమల అడవుల్లో అరుదైన సర్పం తొలిసారిగా కనిపించింది. నాగార్జున సాగర్ - శ్రీశైలం అభయారణ్యంలో ఈ పామును గుర్తించిన బయోల్యాబ్ రేంజ్ సిబ్బంది, ఇది లైకోడాన్ ఫ్లావికోల్లిన్ జాతికి చెందినదని వెల్లడించారు. ఈ పాము చాలా చిన్నగా ఉంటుందని, దీనికి తెలివి చాలా ఎక్కువగా ఉండటంతో దీన్ని 'వూల్ఫ్ స్నేక్' అని కూడా పిలుస్తారని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రేమ వెల్లడించారు. వూల్ఫ్ స్నేక్స్ లో ఐదు రకాల జాతులు ఉంటాయని, వాటిల్లో మూడు రకాలను ఇప్పటికే అభయారణ్యంలో గుర్తించామని వెల్లడించిన ఆమె, ఇవి అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటాయని, వీటి మెడ చుట్టూ ఉండే ఆకుపచ్చని రంగుతో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుందని అన్నారు.