paruchuri: 'టైమ్ లేదు .. వెళ్లిపోతున్నాను'.. నాతో హరికృష్ణ చెప్పిన చివరి మాటలు ఇవే!: పరుచూరి గోపాలకృష్ణ
- పెళ్లికి రమ్మని హరికృష్ణను ఆహ్వానించాను
- సత్యనారాయణ వ్రతానికి రమ్మని కోరాను
- నేను రాలేను అనే ఆయన చెప్పాడు
ఆగస్టు 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయిన సంగతి తెలిసిందే. తనతో ఆయన మాట్లాడిన చివరి మాటలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. "ఆగస్టు 27వ తేదీన ఉదయం నేను హరికృష్ణకు ఫోన్ చేశాను. 'నాన్నా, మా అల్లుడు .. కూతురు మీ ఇంటికొచ్చి శుభలేఖ ఇచ్చారు చూశావా?' అని అడిగాను. 'చూడలేదు .. ఎవరిది పెళ్లి?' అని అడిగాడు. 'నా మనవరాలి పెళ్లి .. ఆగస్టు 30వ తేదీన .. నువ్వొచ్చి అక్షితలు వేస్తే .. అన్నగారే వచ్చి అక్షితలు వేసినట్టుగా భావిస్తాను' అన్నాను.
'సారీ రాలేను' .. 29 ఉదయాన్నే ఊరికి వెళుతున్నాను .. 30 పొద్దున్నే రాగలుగుతానో లేదో నాకు తెలియదు కదా' అన్నాడు. 'పోనీ ఒక పనిచేయి హరి .. 31వ తేదీన ఉదయం 'సత్యనారాయణ స్వామి వ్రతం' వుంది .. అప్పుడైనా వచ్చి వధూవరులకు అక్షితలు వేయి' అన్నాను. 'అప్పుడు కూడా 'రాలేను' అనే అన్నారు. 'రాలేను' అనే మాట నేను తన నోటివెంట వినడం అదే మొదటిసారి.
అయితే ఈ రోజు (ఆగస్టు 27వ తేదీ) ఉదయం 11 గంటల 30 నిమిషాలకి నా మనవరాలిని పెళ్లి కూతురుని చేస్తారు .. అప్పుడు వచ్చి అక్షితలు వేయి' అని అడిగాను. అయితే ఆ రోజున నేను బయటికి వెళ్లినప్పుడు హరికృష్ణ వచ్చి నా మనవరాలికి అక్షితలు వేశారు. ఆయన వచ్చినట్టు తెలిసి నేను ఫోన్ చేసి రెండు నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పాను. అప్పుడు ఆయన 'టైమ్ లేదు వెళ్లిపోతున్నాను' అని అన్నాడు. ఎందుకు ఆ భగవంతుడు ఆయనతో అలా మాట్లాడించాడో .. ఎందుకిలా జరిగిందో అసలు అర్థం కావడం లేదు" అని చెప్పుకొచ్చారు.