paruchuri: ఒకసారి హరికృష్ణతో కలిసి కార్లో బయల్దేరాను .. ఇంజన్లో నుంచి పొగలు వచ్చాయి!: పరుచూరి గోపాలకృష్ణ
- నా కోసం హరికృష్ణ వచ్చాడు
- కార్లో హైదరాబాద్ కి బయలుదేరాము
- మార్గమధ్యంలో కారు ఆగిపోయింది
రచయితగా పరుచూరి గోపాలకృష్ణకి ఎంతోమంచి పేరుంది. ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన కొన్ని సినిమాలకి ఆయన కథ, మాటలు అందించారు. అలాంటి ఆయన తాజాగా నందమూరి హరికృష్ణతో తనకి గల అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు. "1980లో అనుకుంటాను .. రామారావుగారి 'అనురాగ దేవత' సినిమాకి పనిచేసే అవకాశం లభించింది. దాంతో నన్ను 'ఉయ్యూరు' నుంచి తీసుకురమ్మని అన్నగారు .. హరికృష్ణను పంపించారు. మా ఊరి నుంచి హరికృష్ణతో కలిసి కారులో బయలుదేరాను. అప్పుడాయన కారును ఎంత వేగంగా నడిపాడంటే, 'నార్కెట్ పల్లి' దగ్గరికి రాగానే ఇంజన్లో నుంచి పొగలువచ్చి ఆగిపోయింది. అప్పుడు ఆయన నన్ను 'భయపడ్డారా?' అని అడిగాడు. 'లేదు బాబూ' అన్నాను. 'ఎందుకు భయం వేయలేదు?' అని అడిగాడు. 'డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మీకు లేని భయం .. నా కెందుకు? .. నా దృష్టిలో నా ప్రాణం కంటే నీ ప్రాణాలు ముఖ్యం' అన్నాను. అప్పుడు దగ్గరలో వున్న 'దాబా'కి వెళ్లి ఇద్దరం కాఫీ తాగాము. అప్పుడు ఆయన 'పరుచూరి గోపాలకృష్ణ' అని కాకుండా నేను మిమ్మల్ని 'ప.గో'అని పిలుస్తాను అన్నాడు .. అప్పటి నుంచి ఆయన అలాగే పిలుస్తూ వచ్చాడు' అని గుర్తుచేసుకున్నారు.