THAILAND: బ్యాంకాక్ కు జలగండం.. హెచ్చరిస్తున్న ప్రపంచ బ్యాంకు!
- ఏటా 2 సెం.మీ మునిగిపోతున్ననగరం
- సగటు కంటే ఎక్కువగా సముద్రమట్టం పెరుగుదల
- ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్ లాండ్ కు పెనుముప్పు పొంచి ఉందా? ఆ దేశ రాజధాని బ్యాంకాక్ త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక మరో పదేళ్లలో బ్యాంకాక్ లోని 40 శాతం భూభాగం నీటిలో మునిగిపోతుందని హెచ్చరించింది.
2011లో రుతుపవనాల సందర్భంగా భారీ వర్షాలు కురవడంతో బ్యాంకాక్ లో 20 శాతం ప్రాంతం నీట మునిగింది. ప్రస్తుతం ఈ నగరం ఏటా 2 సెం.మీ చొప్పున సముద్రంలో మునిగిపోతోంది. అంతేకాకుండా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే సముద్రమట్టం ఇక్కడ ఏటా 4 మిల్లీమీటర్లు అధికంగా పెరుగుతోంది.
పట్టణీకరణ, తీరప్రాంత కొరత, భారీ బిల్డింగుల నిర్మాణం వెరసి ఈ నగరం ముంపు ముప్పులో చిక్కుకుందని నిపుణులు చెబుతున్నారు. నగరంలో సహజనీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా రోడ్ల నిర్మాణం జరగడం కూడా పరిస్థితి చేయిదాటి పోయేందుకు కారణం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. రొయ్యల సాగు కోసం మడ అడవులను నరికేస్తుండటంతో తీర ప్రాంతంలో నేల కోత విపరీతంగా పెరిగిందని గుర్తుచేశారు.
బ్యాంకాక్ ను కాపాడుకోవాలంటే వెంటనే నగరంలో 2,600 కి.మీ మేర మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మించాలి. అంతేకాకుండా వరద నీటిని బయటకు పంపేసేందుకు 8 భూగర్భ సొరంగ మార్గాలను తవ్వాల్సి ఉంటుంది.