Swara Bhasker: వరవరరావు అరెస్ట్‌పై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

  • మహాత్మాగాంధీని చంపినవారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు
  • విజయ్ మాల్యాను ఏమీ చేయలేకపోతున్నారు
  • పేదల కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు

బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాత్మాగాంధీని హత్య చేసిన వారు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావుతోపాటు మరో నలుగురు హక్కుల నేతలను అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి ఓ ట్వీట్‌లో తీవ్రంగా స్పందించాడు.

అర్బన్ నక్సలైట్లను సమర్థించేవారి జాబితాను తయారుచేయడానికి చురుకైన యువత తనకు కావాలని, ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువత తనను సంప్రదించాలని కోరాడు. వివేక్ ట్వీట్‌కు నటి స్వర భాస్కర్ ఫన్నీగా స్పందించింది. అర్బన్ నక్సల్స్‌ను తాను చూశానని, వారు టీవీ చర్చల్లో కనిపిస్తారని, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లలో ఉంటారని, ఇది చాలా హాస్యాస్పదమని చలోక్తులు విసిరింది. అంతేకాదు, వరవరరావు తదితరుల అరెస్ట్‌పైనా తీవ్రంగా స్పందించింది.

ప్రజలను వారి చర్యల ద్వారా మాత్రమే శిక్షించగలరని, వారి ఆలోచనలను శిక్షించలేరని పేర్కొంది. ఒకవేళ వ్యక్తుల ఆలోచనలనే అరెస్టులు చేసుకుంటూ పోతే దేశంలోని జైళ్లు సరిపోవని తెలిపింది. అప్పట్లో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు చాలామంది పండుగ చేసుకున్నారని, ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదని పేర్కొంది.

వరవరరావు అరెస్టును ఖండించిన నటి, కేంద్రం చేస్తున్న కొన్ని పనులు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయంది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారి కేసుల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపించింది. వేల కోట్ల రూపాయలు ముంచేసి విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని ప్రభుత్వం.. నిరు పేదల కోసం పోరాడుతున్న వారిని మాత్రం అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తోందని స్వరభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసింది.

Swara Bhasker
Urban Naxals
Bollywood
Varavara Rao
Mahatma Gandhi
Narendra Modi
  • Loading...

More Telugu News