Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డు లేకుంటే... హైదరాబాద్ స్తంభించిపోయేది!
- హైదరాబాద్ లో ఇప్పటికే 80 లక్షల మంది
- అదనంగా 20 లక్షల మంది వచ్చి చేరితే అస్తవ్యస్తం
- 80 వేల వాహనాలను నగరంలోకి రాకుండా చేసిన ఓఆర్ఆర్
హైదరాబాద్ జనాభా సుమారు 80 లక్షలు... ఇక్కడి వాహనాల సంఖ్య దాదాపు 40 లక్షలు. నిత్యమూ కనీసం 25 లక్షల మంది రహదార్లపైకి 15 లక్షల వాహనాలతో వస్తుంటారు. దానికే హైదరాబాద్ లో నిత్యమూ ట్రాఫిక్ జామ్ లు కనిపిస్తుంటాయి. ఇక ఒకేసారి అన్ని వాహనాలూ బయటకు వస్తే, రోడ్లు ఏమాత్రం సరిపోవు. అటువంటిది హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు అదనంగా మరో 20 లక్షల మంది ఒకేసారి వచ్చి పడితే, ప్రధాన రోడ్లపై మరో 80 వేల వాహనాలు వచ్చి చేరితే, నగరం అస్తవ్యస్తమైపోయుండేది. ప్రజా జీవనం స్తంభించేది. కానీ, ఈ పరిస్థితి ఏర్పడకుండా బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్) కాపాడింది.
నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ జరిగిన వేళ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ కు వాహనాలు బారులు తీరాయి. అయితే, సభకు వచ్చే ఏ వాహనాన్నీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో హైదరాబాద్ లో సాధారణ ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడలేదు. ఇదే సభ ఔటర్ ఏర్పడక ముందు జరిగుంటే, ఇటు పటాన్ చెరువు నుంచి, అటు టోలీచౌకీ నుంచి, మరోవైపు ఉప్పల్ నుంచి వచ్చిన వాహనాలతో హైదరాబాద్ గ్రిడ్ లాక్ అయ్యుండేది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పోలీసులు, ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో ఉపకరించిందని అంటున్నారు.