K Kavitha: సాయంత్రానికి సస్పెన్స్ పోతుందిగా... ఆయన్నే చెప్పనివ్వండి: ఎంపీ కవిత

  • ముందస్తుకు వెళ్లే విషయమై స్పందించేందుకు నిరాకరణ
  • ఏ నిర్ణయమైనా కేసీఆర్ నోటి నుంచే వింటాం
  • పార్టీ నిధులతోనే బహిరంగ సభ జరుపుతున్నామన్న కవిత

తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లే విషయమై స్పందించేందుకు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిరాకరించారు. ముందస్తు ఎన్నికలు లేదా అసెంబ్లీ రద్దుపై తనకు అవగాహన లేదని అంటూనే, సాయంత్రానికి సస్పెన్స్ వీడుతుందని, తమ నేత కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి లక్షలాది మంది ప్రజలతో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె, భారీ బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించడంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు.

ఈ సభకు కూడా ప్రతి పనికీ పార్టీ నిధులనే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బస్సులకు అద్దెలు చెల్లించామని, విద్యుత్ శాఖకు రూ. 30 లక్షలు కట్టామని అన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని సభలో కేసీఆర్ సవివరంగా తెలియజేస్తారని, సభ నిర్వహణ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశామని కాంగ్రెస్ విమర్శించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఎన్నికలు నెల రోజుల తరువాత వచ్చినా, మూడు నెలల తరువాత వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News