pan card: పాన్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సింగిల్ పేరెంట్స్ కు ఊరట!
- ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
- 17లోపు అభ్యంతరాలు తెలపాలని విజ్ఞప్తి
- తండ్రి పేరు తప్పనిసరి నిబంధనపై దృష్టి
పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పాన్ కార్డులో తండ్రి పేరు ఉండటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. తండ్రి పేరు చేర్చాలన్న నిబంధనను సవరిస్తామని వెల్లడించింది. తల్లి మాత్రమే ఉన్న (సింగిల్ పేరెంట్) చిన్నారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం దరఖాస్తు 49ఏ, 49ఏఏ లో సవరణలు చేస్తూ ముసాయిదాను విడుదల చేసింది.
దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17లోపు తెలియజేయాలని కేంద్రం ప్రజలను కోరింది. దీని ప్రకారం పాన్ దరఖాస్తులో కేవలం తల్లి పేరు రాస్తే సరిపోతుందని వెల్లడించింది. పాన్ కార్డు లేకుండా ఎవరైనా ఓ ఏడాదిలో జరిపిన ఆర్థిక వ్యవహారాల విలువ రూ.2.50 లక్షలకు మించితే.. మరుసటి ఏడాది మే 31లోపు వారు పాన్ తీసుకునేలా ఈ ముసాయిదాలో ఓ ప్రతిపాదనను చేర్చారు.