Delhi: మరొక్క 8 మీటర్లే.. కుతుబ్ మీనార్ ఎత్తును దాటేయనున్న ఢిల్లీ చెత్త!
- ఢిల్లీ ఘజీపూర్‌లో రికార్డు స్థాయిలో పేరుకుపోయిన చెత్త
- కొండను తలపిస్తున్న డంపింగ్ యార్డ్
- రాజధానిలో రోజుకు 2,600 టన్నుల చెత్త ఉత్పత్తి
మరొక్క ఎనిమిది మీటర్లు చాలు. 73 మీటర్ల ఎత్తైన కుతుబ్ మీనార్‌ను అధిగమించేందుకు... అవును.. ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ డంపింగ్ యార్డ్‌లో ఇప్పటికే 65 మీటర్ల ఎత్తున చెత్త పేరుకుపోయి పెద్ద కొండను తలపిస్తోంది. మరో 8 మీటర్ల మేర చెత్తను దానిపై డంప్ చేస్తే కుతుబ్ మీనార్ ఎత్తును కూడా దాటేస్తుంది. నిజానికి చెత్త డంపింగ్ 20 మీటర్లకు మించి ఉండకూడదనే నిబంధన ఉంది. ఇప్పుడిక్కడ పేరుకుపోయిన చెత్త దానికంటే 45 మీటర్లు అధికంగా ఉంది. మొత్తం 70 ఎకరాల్లో 12 మిలియన్ టన్నుల చెత్త ఇప్పుడక్కడ పేరుకుపోయింది.
ఢిల్లీలో ప్రతీరోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను డంపింగ్ చేసేందుకు తమకు మరోమార్గం లేదని ఈడీఎంసీ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ ప్రదీప్ ఖండేవాల్ తెలిపారు. 1984 నుంచి ప్రభుత్వం ఘాజీపూర్‌లో చెత్తను డంప్ చేస్తోంది. నగరంలో ఇదే అత్యంత పురాతనమైన డంపింగ్ యార్డ్. ఢిల్లీలో ప్రతీ రోజు 2,600 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, దానిని మొత్తంగా ఇక్కడే డంప్ చేస్తున్నారు. ఇది కాస్తా కొండను తలపిస్తూ ప్రమాదకరంగా మారడంతో కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నట్టు అధికారులు తెలిపారు.