Hyderabad: పెంపుడు కుక్కల యజమానులకు శుభవార్త.. కొండాపూర్‌లో పూర్తయిన డాగ్ పార్క్!
- 1.2 ఎకరాల్లో నిర్మాణం
- ఈ వారంలోనే ప్రారంభం
- శునకాల కోసం సకల సౌకర్యాలు
హైదరాబాద్‌లోని శునక ప్రేమికులకు, వాటి యజమానులకు ఇది శుభవార్తే. కొండాపూర్‌లో 1.2 ఎకరాల్లో చేపట్టిన డాగ్‌పార్క్ నిర్మాణం పూర్తయింది. మరో వారం రోజుల్లో ఇది ప్రారంభం కానుంది. విశాలంగా నిర్మించిన ఈ పార్కులో శునకాల కోసం ఈత కొలను, ఆడుకునే వస్తువులు, వ్యాయామ, ఆహార శాల, ముస్తాబు కేంద్రం వంటి సదుపాయాలను సమకూర్చారు. తమ శునకాలతోపాటు యజమానులు కూడా ఇక్కడ హాయిగా సేదదీరొచ్చు.
దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో పెంపుడు జంతువుల కోసం పార్కులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి రానుంది. కొండాపూర్‌లోని రాడిసన్ హోటల్ వెనక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పార్కు ప్రారంభోత్సవం కోసం ముస్తాబవుతోంది. గ్రేటర్ పరిధిలో లక్షలకు పైగా పెంపుడు శునకాలున్నాయని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. వాటి సౌకర్యార్థం ఈ పార్కును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. చిన్నకుక్కలు, పెద్ద కుక్కలకు వేర్వేరుగా క్రీడా ప్రాంగణాలు, శిక్షణ కేంద్రాలు, శునకాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కేంద్రం, స్పా వంటివి ఇందులో ఉన్నట్టు తెలిపారు. అలాగే వైద్యులు, పర్యవేక్షణ నిపుణులను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎంట్రీ ఫీజును రూ.10గా నిర్ణయించినట్టు వివరించారు.