Marriage: అబ్బాయిలు ఇక 18 ఏళ్లకే పెళ్లాడొచ్చు.. ప్రభుత్వానికి లా కమిషన్ సంచలన ప్రతిపాదన!
- పురుషుల వివాహ కనీస వయసును మూడేళ్లు తగ్గించిన కమిషన్
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- ఆమోదయోగ్యం కాదంటున్న విశ్లేషకులు
పురుషుల కనీస వివాహ అర్హత వయసు తగ్గే అవకాశం వుంది. ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని పేర్కొంది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం.. ఓ వ్యక్తి మెజారిటీ వయసు 18 ఏళ్లని, స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
లాకమిషన్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీపురుష సమానత్వం మాట ఎలా ఉన్నా, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టు అవుతుందని చెబుతున్నారు. నిజానికి భారతీయ సంస్కృతిలో వివాహం చేసేటప్పుడు అబ్బాయి కంటే అమ్మాయి వయసు కనీసం మూడేళ్లు తక్కువగా ఉండాలని చెబుతారు. అలా చూసుకుంటే.. ప్రస్తుత సిఫార్సుల ప్రకారం అమ్మాయి వయసు 15 ఏళ్లు ఉండాలి. మరీ ఇంత తేడా లేకున్నా కనీసం ఏడాదైనా ఉండేలా చూసుకున్నా అప్పుడు అమ్మాయి వయసు 17 ఏళ్లు అవుతుంది. అలా చేస్తే.. అది బాల్య వివాహం కిందికి వస్తుంది. కాబట్టి లా కమిషన్ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదని వాదిస్తున్నారు.