Andhra Pradesh: లక్ష మంది క్రిస్టియన్ మైనార్టీలతో త్వరలో బహిరంగ సభ: ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

  • విద్య, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ తరహా సభలు
  • క్రైస్తవుల నాయకత్వం పెంపొందించేందుకే 
  • వివరాలన్నింటిని సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారు

లక్ష మంది క్రిస్టియన్ మైనార్టీలతో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు తెలిపారు. ఏపీ సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సభ నిర్వహించే ప్రదేశం, తేదీ వివరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని చెప్పారు. విద్య, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ తరహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవుల నాయకత్వం పెంపొందించడానికి ఇటువంటి సభలు ఉపయోగపడతాయని జూపూడి అభిప్రాయపడ్డారు.

మత ఘర్షణలకు దిగజారిన వైసీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి దిగజారిందని జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. గుంటూరులో జరిగిన ‘నారా హమారా-టీడీపీ హమారా’ బహిరంగ సభలో ఫ్లకార్డులు పట్టుకొని అలజడి సృష్టించిన యువకులు వైసీపీ కార్యకర్తలని తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి వారిని పంపారని, అమాయకులైన పేద ముస్లిం మైనార్టీ యువకులను ఉసిగొల్పి గుంటూరు సభలో ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేయించారని ఆరోపించారు. అమాయకులైన ముస్లింలను బలి చేసేందుకు వైసీపీ పన్నిన కుట్రపై రాష్ట్రంలోని ముస్లింలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  

ఇతర పార్టీ బహిరంగ సభలలోకి చొరబడి అలజడి సృష్టించే సంప్రదాయం మన రాష్ట్రంలో లేదన్నారు. తాము గానీ, ఇతర పార్టీల వారు గానీ, కమ్యూనిస్టులు గానీ అలా చేయరని చెప్పారు. మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని, ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా ఆ పార్టీపై ముద్రపడిందని, అటువంటి పార్టీతో కలిసి వైసీపీ పని చేస్తోందని విమర్శించారు. టీడీపీ బహిరంగ సభలను విచ్ఛిన్నం చేయడానికి, మత ఘర్షణలు సృష్టించడానికి ఆ పార్టీ దిగజారడం సిగ్గు చేటని, టీడీపీ పేదవర్గాల వైపు నిలబడిందని చెప్పారు.  

Andhra Pradesh
sc corporation
jupudi
  • Loading...

More Telugu News