Medak District: మెదక్ లో లారీ కంటైనర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్!
- తుప్రాన్ టోల్ గేట్ వద్ద ప్రమాదం
- గురువారం అర్ధరాత్రి ఘటన
- 11 మందికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి తుప్రాన్ టోల్ గేట్ వద్దకు వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందున్న రెండు కార్లను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ తృటిలో తప్పించుకున్నారు. గురువారం అర్ధరాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన రవీందర్.. తన కుటుంబ సభ్యులతో కలసి తిరిగివస్తున్నారు. వీరంతా రెండు కార్లలో తుప్రాన్ టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నారు. ఇంతలోనే వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ ఈ కార్లను వెనుకనుంచి బలంగా ఢీకొంది. దీంతో వెనుక కారులో ఉన్న రవీందర్ బంధువు అనిత ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా అదే కారులో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ టోల్ బూత్ ల పైకి కూడా దూసుకుపోవడంతో ఆరుగురు సిబ్బంది కూడా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదం నుంచి వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు ప్రారంభించారు.