New York: న్యూయార్క్ పేరు మార్చేసిన స్నాప్‌చాట్ మ్యాప్.. జ్యూట్రోపోలిస్గా నామకరణం.. పేలుతున్న జోకులు!
- స్నాప్‌చాట్ మ్యాప్‌లో న్యూయార్క్ మాయం
- నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్న నెటిజన్లు
- గోథమ్ సిటీ కూడా ఎక్కడో ఉండే ఉంటుందంటూ జోకులు
అమెరికాలోని న్యూయార్క్ సిటీ పేరును స్నాప్‌చాట్‌కు చెందిన స్నాప్‌చాట్ మ్యాప్ మార్చేసింది. ‘జ్యూట్రోపోలిస్’గా నామకరణం చేసింది. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. న్యూయార్క్‌లోని జ్యూస్ సోషల్ మీడియా వేదికగా స్నాప్‌చాట్‌ను ఆడుకుంటుండగా పేరు మార్పు యాంటీ సెమిటజాన్ని (యూదులకు వ్యతిరేకం) ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్నాప్ మ్యాప్ ఫీచర్ అనేది స్నాప్‌చాట్ యూజర్ల కోసం ఉద్దేశించినది. స్నేహితులు, లొకేషన్లను తెలుసుకునేందుకు దీనిని అభివృద్ధి చేశారు. అయితే, న్యూయార్క్ పేరును ‘జ్యూట్రోపోలిస్’గా పేర్కొనడంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్పందించిన స్నాప్‌చాట్... ఈ సాఫ్ట్‌వేర్‌ను థర్డ్ పార్టీ కంపెనీ అయిన ‘మ్యాప్ బాక్స్’ నుంచి తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎవరో ట్యాంపర్ చేసి పేరును మార్చి ఉండొచ్చని తెలిపింది.
నెటిజన్లు మాత్రం స్నాప్‌చాట్ తీరుపై మండిపడుతున్నారు. జ్యూట్రోపోలిస్ అనేది బ్రూక్లిన్‌లో ఉందని, మాన్‌హట్టన్‌లో కాదని, ఇటువంటి వాటిని నమ్మవద్దని కోరారు. స్నాప్‌చాట్ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ జ్యూట్రోపోలిస్ అయితే కచ్చితంగా గోథమ్ నగరం కూడా ఎక్కడో ఉంటుందని మరొకరు జోకేశారు.