Banks: బ్యాంకుల మూత అవాస్తవం... అదేమీ లేదన్న ఎన్‌వోబీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు అశ్వని రాణా
- రేపటి నుంచి వారం పాటు బ్యాంకులు మూతంటూ వార్తలు
- ఖండించిన బ్యాంకు ఉద్యోగులు
- సమ్మె నిజమే కానీ.. బ్యాంకులపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
రేపటి నుంచి ఐదో తేదీ వరకు బ్యాంకులు మూతపడనున్నాయన్న వార్త వైరల్ కావడంతో నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా స్పందించారు. ఆ వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని తెలిపారు. 4-5 తేదీల్లో రిజర్వుబ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారన్న వార్తను తప్పుగా అర్థం చేసుకున్నారని, అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారన్న ప్రచారం జరగడం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆర్బీఐ ఉద్యోగులు మాత్రమే సమ్మెకు వెళ్తున్నారని, కాబట్టి బ్యాంకులు చాలా వరకు యథావిధిగా పనిచేస్తాయని వివరించారు. ఏటీఎంల నిర్వహణకు కూడా ఇబ్బంది ఉండదని తెలిపారు.
కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. శనివారం చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవని, ఆదివారం, ఆ తర్వాత సోమవారం కృష్ణాష్టమి, ఆ తర్వాత రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు తెరుచుకోవన్న వార్త వైరల్ అయింది. దీంతో స్పందించిన రాణా అటువంటిదేమీ లేదని, బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని వివరణ ఇచ్చారు.