Telangana: వ్యక్తిపై కత్తితో దాడి.. పొట్టలో కత్తితో పోలీస్ స్టేషన్‌కు బాధితుడు!

  • ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తిని పొట్టలో దింపిన దుండగులు
  • కుమారుడికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు బాధితుడు
  • పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు

హత్య చేయడానికి వచ్చిన దుండుగులు బాధితుడి పొట్టలో కత్తితో పొడిచి పరారయ్యారు. రక్తం బయటకు రాకుండా కత్తిని చేత్తో గట్టిగా పట్టుకున్న బాధితుడు.. కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు రావడానికి ఆలస్యమవుతుందని భావించి రక్తమోడుతుండగానే పొట్టలో కత్తితో పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రుద్ర కాలనీలో ఉండే  నరసింగం(58) టింబరు డిపో నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు తమకు ద్వారాలు కావాలని మాటలు కలిపారు. వారి తీరుపై అనుమానం వచ్చిన నరసింగం అప్రమత్తమయ్యే లోపే అతడి పొట్టలో కత్తి దింపి పరారయ్యారు.

నొప్పితో విలవిల్లాడిన నరసింగం ఓ చేత్తో కత్తిని పట్టుకుని కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు రావడానికి ఆలస్యమవుతుందని భావించి అలాగే పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. అయితే, కాస్త దూరం వెళ్లగానే కళ్లు తిరుగుతున్నట్టు అనిపించడంతో మైఫిల్ హోటల్ వద్ద ఆగాడు. అంతలో కుమారుడు రావడంతో ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రక్తమోడుతున్న నరసింగాన్ని పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూతగాదాలే నరసింగంపై దాడికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. దుండగులతో అతడికి భూవివాదాలు ఉన్నాయని, అవి ఎటూ తెగకపోవడంతో నరసింగాన్ని అంతమొందించాలని దుండగులు ప్లాన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.

Telangana
Crime News
Shamshabad
Timber Depot
Attack
  • Loading...

More Telugu News