KCR: 'ముందస్తు' రిస్క్ నీ బాధ్యతే... ఎన్నికలు ఎప్పుడో చెప్పలేను: కేసీఆర్ కు స్పష్టం చేసిన నరేంద్ర మోదీ!
- ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
- స్వీయ రిస్క్ తోనే తుది నిర్ణయం తీసుకోండి
- ఎన్నికల నిర్వహణ ఆద్యంతం ఈసీ చేతుల్లోనే
- కేసీఆర్ కు స్పష్టం చేసిన మోదీ
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే, ఆపై జరిగే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, తుది నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, తన మనసులోని ముందస్తు ఆలోచనను మోదీకి వెల్లడించగా, "ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందన్న విషయాన్ని నేను చెప్పలేను. స్వీయ రిస్క్ తోనే తుది నిర్ణయం తీసుకోండి" అని మోదీ స్పష్టంగా చెప్పినట్టు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
ముందస్తు ఎన్నికలపై మోదీ నుంచి హామీని తీసుకోవాలని కేసీఆర్ భావించగా, అది జరగలేదని తెలుస్తుండగా, తన మనసులో ఉన్న ఆలోచనకు తగ్గట్టుగా ఎన్నికలను జరిపిస్తామని మోదీ స్వయంగా చెప్పకపోవడంతో కేసీఆర్ కొంత మనస్తాపానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే, ఈ డిసెంబర్ లో మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉండటంతో, వాటితో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అది జరగాలంటే, సెప్టెంబర్ లోనే అసెంబ్లీ రద్దు కావడం తప్పనిసరి.
అసెంబ్లీ రద్దు కానంతవరకూ ఈసీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోదు. ఒకసారి అసెంబ్లీ రద్దయితే, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న విషయం ఈసీ పరిధిలోకి వెళ్లిపోతుంది. డిసెంబర్ లో ఎన్నికలు జరిపించేందుకు ఈసీ సిద్ధంగా లేకుంటే, కేసీఆర్ 'గేమ్ ప్లాన్' మొత్తం విఫలమైనట్టే. ముందస్తుగానే ఎన్నికలు జరిపించే విషయం, ఈసీ పరిధిలో ఉన్నందునే తాము ఎటువంటి హామీనీ ఇవ్వలేకపోతున్నానని, ఈసీ కేంద్ర నియంత్రణలోలేని స్వతంత్ర సంఘమని కూడా మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే, ఒకసారి అసెంబ్లీ రద్దయితే, ఆరు నెలల్లోగా ఎన్నికలు జరిపించడం ఆనవాయితీగా వస్తుండటంతో కేసీఆర్, ముందస్తుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.