Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘చంటిగాడు’ దర్శకురాలు జయ కన్నుమూత
- సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన జయ
- దర్శకత్వంపై మక్కువతో మెగాఫోన్ చేతపట్టిన వైనం
- తొలి సినిమాతోనే ప్రతిభ చాటుకున్న జయ
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో మృతి చెందారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయ 2003లో 'చంటిగాడు' సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. అంతకుముందు సినీ జర్నలిస్టుగా పనిచేశారు. అయితే, సినిమాలపై మక్కువతో ఆమె దర్శకత్వ రంగంవైపు అడుగుపెట్టారు. ప్రేమికులు, గుండమ్మగారి మనువడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కామ్న జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను పరిచయం చేసింది జయనే.
ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజు ఆమె భర్త. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ తొలుత సినీ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మెగాఫోన్ చేపట్టి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె తీసిన ఆఖరు చిత్రం ‘వైశాఖం’. శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.